అప్పలాయగుంట ఆలయ విశిష్టత ఏంటంటే..

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆల‌య విశిష్టత చాలా గొప్పది. ఈ ఆలయానికి సుమారు వేయి ఏళ్లుకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్నది. కార్వేటి నగర ప్రభువుల పాలనలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి అప్పలాయగుంట ఆలయం ఉండినట్లు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయ ఉత్సవాలు, ఊరేగింపుల తరహాలో అప్పలాయగుంట ఆలయమునందు కూడా కార్వేటినగర ప్రభువులు ప్రధానపాత్ర పోషించి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి తపస్సును మెచ్చి, ఆయన కోరిక మేరకు ప్రసన్నుడై అక్కడ అభయ హస్తముతో వెలసినట్లు తెలియుచున్నది. ఈ ఆలయం తూర్పు ముఖముగా నిర్మింపబడి, గర్భాలయం నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూలమూర్తి చతుర్బుజుడై శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం, అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటూ శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, బాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగియున్నారు. గర్భాలయానికి నైరుతిమూలలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయము, వాయువ్యమూలలో శ్రీగోదాలక్ష్మీ అమ్మవారి ఆలయం స్వామివారికి అభిముఖముగా గరుత్మంతుల వారి విగ్రహము వెలసియున్నది. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది.

Share this post with your friends