సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆరు ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో తిరుచెందూర్ కూడా ఒకటి. తమిళనాడులోని తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. సుబ్రహ్మణ్యుని షణ్ముఖ క్షేత్రాలలో ఒకటిగా ఇది భాసిల్లుతోంది. తిరుచెందూర్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. ముఖ్యంగా ఈ క్షేత్రం సముద్ర తీరంలో ఉంటుంది కాబట్టి ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ చారిత్రక నేపధ్యం, కుమార స్వామి మహిమలు, ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను అబ్బురపరుస్తాయి. అలాగే ఈ క్షేత్రం అత్యంత మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.
తిరుచెందూర్‌లో సుబ్రహ్మణ్య షష్టిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో కొలువైన కుమారస్వామి రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు శ్రీవల్లీ, దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉండటం విశేషం. ఈ ఆలయంలోనే భుజంగ స్తోత్రం పుట్టిందని చెబుతారు. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసం తిరుచెందూర్ వెళ్లారట. ఎందుకోగానీ వెళ్లగానే స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోకుండా ఆలయం వెలుపల కూర్చొని ఉన్నారట. అప్పుడు ఆయనకు ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రాన్ని ధ్యానంలోనే ఆశువుగా చెప్పారని ప్రతీతి.