తిరునల్లార్ శని దేవాలయంలోని నల పుష్కరిణి విశిష్టత ఏంటంటే..

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో రెండు నదుల మధ్య తిరునల్లార్ శని దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శనితో పాటు శివుడు కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడ ముందుగా శనీశ్వరుడిని దర్శించుకున్న మీదట శివుడిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న నల పుష్కరిణిలో స్నానమాచరిస్తే సకల శని దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అందుకే భక్తులు తప్పనిసరిగా ఇక్కడకు వస్తే నలపుష్కరిణిలో స్నానమాచరిస్తారు. నలపుష్కరిణి విశిష్టతను తెలిపే కథ ఒకటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విదర్భ చక్రవర్తి భీమునికి దమయంతి అనే కూతురు ఉంది. ఆమె అపురూపమైన అందగత్తె. ఆమె ముగ్ద మనోహర రూపానికి రాజులు, దేవతలంతా దాసోహమై ఆమెను వివాహం చేసుకునేందుకు యత్నించారు. దమయంతి మాత్రం వారందరినీ కాదని నల మహారాజును వివాహం చేసుకుంది. తమను కాదని నల మహారాజును దమయంతి వివాహం చేసుకోవడం దేవతలకు అస్సలు నచ్చలేదట. వారంతా శని దేవుని వద్దకు వెళ్లి ఆ జంటను ఇబ్బందులు పెట్టమని వేడుకున్నారంట. సరేనన్న శనీశ్వరుడు నలుడిని అష్టకష్టాల పాలు చేశాడట. రాజ్యం, సిరిసంపదలు అన్నీ పోవడంతో బంధువులు కూడా దూరం పెట్టారట. చివరకు నలుడికి భార్య కూడా దూరమైందట. దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు. దేశదేశాలు తిరిగి తిరునల్లార్ శని దేవాలయానికి వచ్చి అక్కడి పుష్కరిణిలోస్నానమాచరించి శివుడిని పూజించాడట. అంతే నలునికి శని బాధలు తొలగిపోయి ఆయన రాజ్యం ఆయనకు దక్కిందట. అందుకే ఈ పుష్కరిణికి ‘నలతీర్థం’ అని పేరు వచ్చింది.

Share this post with your friends