రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తులకు స్వామి 9 అడుగుల ఏకశిలా విగ్రహంతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. ఆంజనేయ స్వామికి అభిముఖంగా రాముల వారు కొలువై ఉంటారు. హనుమంతుడి కంటి కాంతి కిరణాలు నిత్యం రాముల వారి పాదాలను స్పృశిస్తూ ఉంటాయి. శ్రీ సీతారాముల ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి, శివాలయాలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ మూడు ఆలయాలను భక్తులు దర్శించుకునేవారు. ముగ్గురు దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించి నిత్య పూజలు నిర్వహించేవారు.
ఈ ఆలయ ప్రాంతంలోనే ఒక రావి చెట్టు ఉంది. దీనిపై ఉన్న బ్రహ్మ రాక్షసి ఉండేదట. స్వామివారికి నైవేద్యాలను సమర్పించకుండా భక్తులకు ఆటంకాలు కలిగిస్తూ ఉండేదట. దీంతో ఆందోళనకు గురైన భక్తులు ఒక రోజు రాత్రి రాముని ఆలయంలో నిద్రించారు. అప్పుడు వారికి కలలో ఆంజనేయస్వామిప్రత్యక్షమై తాను సమీప గ్రామంలో ఉన్నానని.. తనను ఇక్కడకు తీసుకోవచ్చు ప్రతిష్టించాలని చెప్పాడట. వెంటనే గ్రామస్తులంతా ఎడ్ల పండ్లతో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ తవ్వకాలు జరపగా అత్యంత సుందరంగా తొమ్మిది అడుగులతో ఉన్న ఆంజనేయుడి ఏక శిల విగ్రహం బయటపడిందట. ఆనందంగా గ్రామస్తులంతా కలిసి విగ్రహాన్ని తీసుకొచ్చారట. అయితే విగ్రహం గ్రామశివారులోకి తీసుకురాగానే రావి చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసి కాలిపోయిందట. అనంతరం వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని రాములోరి పాదాల ముందు ప్రతిష్టించారట.