పుష్య మాసం ప్రత్యేకత గురించి తెలుసకున్నాం కదా.. పుష్య మాసాన్ని దానాల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో నువ్వు గింజంత దానం చేసినా కూడా లభించే పుణ్యం అంతా ఇంతా కాదట. అఖండమైన పుణ్యం లభిస్తుందట. అలాగే పితృతర్పణాలు, ఆబ్దికం వంటివి నిర్వహించి వారి పేరు మీదుగా అన్నదానం చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందట. అలాగే పుష్యమాసంలో నెల రోజుల పాటు శని దేవుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మనపై ఉంటుందట. తద్వారా శని దోషాల నుంచి బయటపడతామట. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తే చాలా మంచిదట.
ఏ మాసంలో అయినా ఏకాదశి చాలా ముఖ్యం. ముఖ్యంగా పుష్య బహుళ ఏకాదశిని విమలైకా ఏకాదశి, కల్యాణ ఏకాదశి అని పిలుస్తారు. పుష్యమాసంలో నువ్వుల నూనె, సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలట. అలాగే ఈ మాసమంతా నువ్వుల్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. వీలితే తినే ఆహారంలోనూ భాగం చేసుకోవాలి. అలాగే మంచినీటిలో కలిపి తాగాలి. ఏకాదశి నాడు తప్పనిసరిగా తిలా దానం చేయాలట. ఇలా చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడట. తత్ఫలితంగా ఏలిన నాటి శని దోషాలు తొలగిస్తాడట. ముఖ్యంగా పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానం చేస్తే చాలా మంచిదట.