కార్తీక మాసం ఉన్నంత ప్రత్యేకత మరే మాసానికి లేదు. ఈ మాసంలో చాలా మంది నెలంతా ఒక్కపూటే భోజనం చేస్తూ చాలా నిష్టగా గడుపుతారు. అంతేకాకుండా ఈ నెలలోనే ఎక్కువగా అయ్యప్ప మాల ధరిస్తారు. ఇక ఈ నెలలో నదీస్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అసలు నదీ స్నానం ఎందుకు ఆచరిస్తారు? ఆచరించడం వలన కలిగే ప్రయోజనమేంటో తెలుసుకుందాం. వాస్తవానికి నిల్వ ఉన్న నీరు చల్లగా ఉంటుంది. పారే నీరు కాస్త వెచ్చగా ఉంటుంది. కార్తీక మాసంతో చలికాలం ఆరంభమవుతుంది. ఈ సమయంలో నదీ స్నానం చేయడం వలన బద్దకం పోయి శరీరం యాక్టివ్ అవతుందనేది ఒక కారణం.
మరో కారణమేంటంటే.. రాళ్లనీ, వృక్షాలనీ రాసుకుంటూ సాగే నదులు.. ఆయా ఖనిజాలనీ, మూలికలనీ తమలో కలుపుకుంటాయి కాబట్టి ఈ నీటికి ఔషధ గుణాలు ఎక్కువ. కాబట్టి ఈ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యపరంగా మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే కార్తీక మాసంలో చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఈ క్రమంలోనే చంద్రుని ప్రభావం నీటి మీద, మానవుల మీద ఎక్కువగా ఉంటుంది. చంద్ర కిరణాలు తాకడంతో నది, చెరువు, కాలువలలోని నీరు ఔషధంగా మారుతుందట. ఈ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారట. ఇక మనం కార్తీక మాసంలో నదిలో లేదా ఇంట్లో స్నానం చేసినా.. ‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు’ అంటూ నదులను కీర్తిస్తూ స్నానమాచరించాలి. స్నానానంతరం సంకల్పం చెప్పుకుని దీపాలను వెలిగించాలి.