
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ సముదాయంలోని నాగచంద్రేశ్వర ఆలయం నాగపంచమి నాడు మాత్రమే తెరవబడుతుందని తెలుసుకున్నాం కదా. అసలు ఈ ఆలయాన్ని తెరవడానికి కారణమేంటి? ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సర్పరాజైన తక్షకుడు శివుడి ఆశీస్సుల కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. రాజు తపస్సుకి మెచ్చిన శివుడు అతనికి అమరత్వం ప్రసాదించాడు. ఆ తరువాత తక్షకుడు సర్ప రూపంలో మహాకాళ అడవిలో ఏకాంతంగా నివసించేవాడు. అంతేకాకుండా తన ఏకాంతానికి భంగం కలగకూడదని కోరుకున్నాడు. అందుకే నాగచంద్రేశ్వర ఆలయ తలుపులు నాగ పంచమి రోజున మాత్రమే తెరుస్తాయి.
నాగచంద్రేశ్వర ఆలయ ప్రత్యేకతలేంటంటే.. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం శిఖరంపై ఉంటుంది. ఈ సర్పదేవుడి ఆలయం ఈనాటిది కాదు.. 11వ శతాబ్దానికి చెందినది. అంతేకాకుండా ఈ విగ్రహం కూడా ఇక్కడిది కాదు.. నేపాల్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చారని చెబుతారు. మరో విశేషం ఏంటంటే.. శ్రీ మహా విష్ణువు సర్పంపై అధిష్టించి ఉన్నట్లుగా ఉంటుంది. ఇలా సర్పాన్ని శివుడు పీఠంగా చేసుకున్న ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ సర్పరాజు విగ్రహం తన పడగను విప్పినట్టుగా ఉంటుంది. శివపార్వతులు తమ తనయులతో కలిసి కూర్చొని ఉంటారు. ఇక నాగ పంచమి నాడు ఈ ఆలయాన్ని తెరిచి నాగచంద్రేశ్వర స్వామి త్రికాల పూజ నిర్వహిస్తారు.
