తమిళనాడులో చోళులు, పల్లవుల కాలంలో అద్భుతమైన కళాఖండాల నిర్మాణం జరిగింది. వారి హయాంలో నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కనీసం టెక్నాలజీకి చోటే లేని ఆ రోజుల్లో అంతటి అద్భుత నిర్మాణాలు ఎలా జరిపారనేది నేటికీ ప్రశ్నార్థకమే. పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు తమిళనాడులోనే ఎక్కువగా వెలుగు చూశాయి. ఇటీవల కూడా పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
తాజాగా కూడా మరోసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు సమీపంలో మురుగన్ ఆలయం ఒకటి ఉంది. దీనిని చోళుల కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. పట్టరైపెరుమంతూర్‌లో కులుత్తుంగ చోళరాజుల పాలనలో 13వ శతాబ్దంలో నిర్మించిన ప్రాచీన మురుగన్ ఆలయం ఇది. అయితే ఆ ఆలయంలో ఒక సొరంగం ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సొరంగం చాలా ఆసక్తికరంగా మారింది. తిరువళ్లూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముఖ్యమైన రోజులలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. సొరంగ మార్గం గురించి తెలిసిన తర్వాత ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.