రాక్షస రాజు వజ్రనాభుడిని బ్రహ్మ దేవుడు సంహరించాడని తెలుసుకున్నాం కదా. అనంతరం బ్రహ్మదేవుడు లోకకల్యాణం కోసం పుష్కర్ ప్రాంతంలో యజ్ఞం చేయాలని సంకల్పించాడట. యజ్ఞానికి సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని బ్రహ్మ దేవుడు పంపించాడట. కానీ నారదుడి కారణంగా ఆమె రాక ఆలస్యమైందట. మరోవైపు ముహూర్తం మించిపోతుండటంతో అనుకున్న సమయానికి ఎలాగైనా యజ్ఞాన్ని ప్రారంభించాలన్న తలంపుతో బ్రహ్మ ఇంద్రుడి సాయం తీసుకుని గాయత్రిని వివాహమాడాడట. అనంతరం యజ్ఞాన్ని ప్రారంభించాడట.
యజ్ఞం జరుగుతున్న సమయంలో సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాల్చిందట. ఒక్క బ్రహ్మను మాత్రమే కాకుండా కోపంలో అక్కడున్న ఇతర దేవతలందరినీ శంపించిందట. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపించిందట. అప్పుడు తనను మన్నించాలని బ్రహ్మ కోరగా.. శాప తీవ్రతను తగ్గించిందట. అందుకే బ్రహ్మకు సంబంధించిన ఆలయం పుష్కర్‌లో తప్ప మరెక్కడా కనిపించదు. సరస్వతీ దేవి శాప ఫలితంగానే బ్రహ్మ వృద్ధుడిగా దర్శనమిస్తాడు. పుష్కర్‌లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం కూడా ఉంది. దానిని సరస్వతీదేవికి మరో పేరు మీదుగా సావిత్రీ నదిగా పిలుస్తారు.