మహారాష్ట్రలో కొలువైన లక్ష్మీదేవి గురించి చాలా ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. శక్తి పీఠాలలో ఒకటిగా కొల్హాపూర్ భాసిల్లుతోంది. మరి లక్ష్మీదేవి కొల్హాపూర్‌కు ఎందుకొచ్చిందో చెప్పేందుకు ఒక కథ ఉంది. ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో మునిగి తేలుతుండగా.. అక్కడకు భృగు మహర్షి వచ్చాడట. అయితే ఆ విషయాన్ని విష్ణు మూర్తి గ్రహించలేదట. దీంతో ఆగ్రహించిన భృగు మహర్షి నారాయణుని వక్ష స్థలంపై కాలితో తన్నాడట. దీంతో లక్ష్మీదేవి తీవ్ర ఆవేదనకు గురైందట. తన నివాస స్థానమైన నారాయణుడి వక్ష స్థలంపై కాలితో తన్నడాన్ని అవమానంగా భావించిందట.
అయినా సరే భృగు మహర్షిని నారాయణుడు ఏమీ అనకపోవడంతో అలిగిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి.. సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిశారని విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. ఇక ఆ తరువాత ఇక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించారట. ఈ ఆలయం 6 వేల సంవత్సరాల నాటిదట. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగానూ.. చూసేందుకు అద్భుతంగానూ ఉంటుందట. ఇక్కడ శిల్ప కళా నైపుణ్యం మనల్ని చూపు తిప్పుకోనివ్వదట. ఈ ఆలయంలో ఐదు గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురంలో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఇక మిగిలిన నాలుగు గోపురాల్లో మధ్య కుమార మండపం, పడమర, ఉత్తర, దక్షిణ గోపురాల్లో గణపతి, మహాకాళి, మహా సరస్వతి కొలువై ఉంటారు.