శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం వెనుక అసలు కథేంటంటే..

శ్రీ మహావిష్ణువు మత్స్యావతరాం వెనుక అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిట్లో చేపపిల్ల పడింది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు … ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది.

అప్పుడు ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడునని , ఏడు రోజులలో ప్రళయం రానున్నదని , సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని , నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి , అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని , సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది. మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా.. సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి.. వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

Share this post with your friends