
మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి. ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల నుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణంలో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే , సుబ్రహ్మణ్యుడి శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ సంహారమునకు అవసరము. దేవతలకు.. రాక్షసులకు, మంచికి – చెడుకి, రాముడికి – రావణుడికి , పాండవులకి – కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము.
ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు… అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక , అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ , యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం. మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు , అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడంలోనూ వర్తిసుంది.
