తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం12.30 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ పాల్గొన్నారు.