కోటప్పకొండపై కొలువైన శివుడి గురించి తెలుసుకున్నాం కదా. ఆలయంలో ఒక్క శివుడు మాత్రమే కాకుండా మరికొందరు దేవుళ్లు కొలువై ఉన్నారు. ఈ కొండపై కనిపించే ‘చతుర్ముఖ బ్రహ్మ’ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన మండపంలో శివుడిగా ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. అలాగే ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి కొలువై ఉండగా.. మధ్యలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడిని ఆరాధిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. అంతేకాకుండా ధ్యాన మందిరంలో ఎడమ వైపు పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. అలాగే యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉంది.
మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రభలు పెద్ద ఎత్తున వచ్చి అందంగా దర్శనమిస్తుంటాయి. శివుడు దక్షిణామూర్తిగానూ.. బ్రహ్మచారిగా వెలిశాడు కాబట్టి ఇక్కడ అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఈ ఆలయంలో పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఇదే కావడం విశేషం. ఇన్ని విశేషాలున్న ఈ కోటప్పకొండను ఒక్కసారైనా దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని అక్కడి వారంతా చెబుతారు. ముఖ్యంగా పిల్లలు దక్షిణామూర్తి రూపంలోని శివుని దర్శించడం వల్ల జ్ఞానం, పూర్ణాయుష్షు కలుగుతుంది.