మనం ఎన్నో సందర్భాల్లో ‘జై బజరంగబళీ’ స్లోగన్ ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏదైనా సాహస కార్యం చేసే ముందు చిన్నతనంలో “జై బజరంగబళీ” అంటూ జెండా ఎగరేసి నట్టు చేతులు పైకెత్తి బయలుదేరే వాళ్ళు లేకపోలేదు. కొత్త సైకిలు బోణీ చేస్తున్నా, “నీవల్ల కాదు” అని అమ్మ వేళాకోళం చేసినప్పుడు అదేపనిని ఛాలెంజ్‌గా తీసుకుని మొదలెట్టేపప్పుడూ ఈ స్లోగన్ చేస్తూ ఉంటారు. “బజరంగబళీ” అంటే హనుమంతుడు అని తెలుసు కానీ.. బజరంగబళీ అంటే అర్థం మాత్రం దాదాపుగా చాలా మందికి తెలీదు.

బజరంగబళీ అంటే అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. “బజరంగబళీ” అనే తెలుగు పదానికి మూలం సంస్కృత పదం – “వజ్రాంగ బలీ. “బజరంగబళీ” అనేది సరైన మాట కాదు. సంస్కృతంలోని “వజ్రాంగబలీ” అని ఆంజనేయుని పేరు. వజ్రములవలే దృఢమైన దేహం కలిగిన బలశాలి అని ఈ పదానికి అర్థం. ఉత్తర భారతదేశంలో, అక్కడి భాష ప్రకారం “వ” కాస్తా “బ” గా మారి “బజ్రాంగ బలీ (బజ్ రంగ్ బలీ) అయ్యింది. మళ్ళీ మన వైపు వచ్చి “బజరంగ బలీ” గానే స్థిరపడింది. దీని అసలు రూపం “వజ్రాంగ బలీ”.
