సోమావతి అమావాస్య గురించి పురాణ కథనం ఏంటంటే..

హిందూ ధర్మంలో సోమావతి అమావాస్యకు గొప్ప ప్రాధాన్యత ఉంది. అమావాస్య అయితే ప్రతి నెలా వస్తుంది కానీ సోమవారం నాడు అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. అందుకే దానికంత ప్రాధాన్యత. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేస్తే చాలా మంచిదట. ఇంట్లో అశాంతి, దారిద్ర్యం అనేవి పోతాయట. అసలు సోమావతి అమావాస్య పురాణ కథనం గురించి తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని, అల్లుడైన పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. దీంతో సతీతదేవి యజ్ఞానికి వెళ్లి యజ్ఞం గుండంలోకి దూకి శరీర త్యాగం చేస్తుంది.

సతీదేవి మరణవార్త విన్న శివుడు తీవ్ర ఆగ్రహంతో తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. వీరభద్రుడు.. సమస్త ప్రమద గణాలతో కలిసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. ఈ క్రమంలోనే చంద్రుడు కూడా గట్టిగానే దెబ్బలు తింటాడు. అప్పుడు తీవ్రగాయాల పాలైన చంద్రుడు శివుడిని శరణు వేడుకుంటాడు. భోళాశంకరుడికి మనసు కరిగి త్వరలో రానున్న సోమావతి అమావాస్యనాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడివి అవుతావని చంద్రుడికి వరమిచ్చాడు. అప్పటి నుంచి సోముడు అంటే చంద్రుడు కాబట్టి సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటున్నాం.

Share this post with your friends