
దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు పది రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు దాదాపు 15 లక్షల మంది వస్తారని అంచనా. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఇంద్రకీలాద్రిపై అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. అమ్మవారు నవరాత్రులలో తొమ్మిది రూపాల్లో దర్శనమివ్వనుంది.
ఈసారి నవరాత్రి ఉత్సవాల్లో లేజర్ షో, కృష్ణమ్మ హారతుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ అని ముందుగానే మనం తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే నేడు ఇంద్రకీలాద్రిపై లేజర్ షో జరిగింది. ఇది భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. లేజర్ షోలో భాగంగా మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను ప్రదర్శించారు. ఇవి చూసి భక్తులంతా పులకించి పోయారు. ఇక నిన్న అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా.. నేడు గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిచ్చింది.
