తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకే ప్రాధాన్యం: టీటీడీ ఈవో

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రత విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు తెలిపారు. ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య, ఎస్టేట్స్ విభాగాలు ఆహార భద్రత విభాగం తో కలసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ, తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందన్నారు. అన్ని తినుబండారాల దుకాణాలు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని, లేనిపక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమాన్ని హోటల్ యజమానులందరూ చక్కగా వినియోగించుకోవాలని ఈవో కోరారు. అంతకుముందు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీ పూర్ణచంద్రరావు తిరుమలలోని రెస్టారెంట్లు మరియు తినుబండారాల యజమానులు పాటించాల్సిన పారిశుద్ధ్య పద్ధతుల, చట్టాలు గురించి వివరించారు. టీటీడీ ఈవో చొరవతో తిరుమల హోటల్ యజమానులకు ఫోస్టాక్ (ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఆశాజ్యోతి, శ్రీ వెంకటేశ్వరులు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన ప్రసాద్‌, విఎస్‌వో శ్రీ సురేంద్ర, ఫోస్టాక్‌ ట్రైనర్‌ శ్రీ ఆంజనేయులు, తిరుమల ఆహార భద్రత విభాగం అధికారి శ్రీ జగదీష్‌, తిరుమలలోని వివిధ హోటళ్ళ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this post with your friends