తలలేని తల్లి.. ఎంతటి చింతనైనా తీరుస్తుందట.. ఈ అమ్మవారు ఎక్కడుందో తెలుసా?

ఆ అమ్మవారికి తల ఉండదు కానీ ఎంతటి చింతనైనా తీరుస్తుందట. ఇంతకీ ఈ అమ్మవారు ఎక్కడుంది? ఏమా కథ అంటారా? ఈ అమ్మవారి చిన్మస్తికా దేవి అని అంటారు. చిన్ అంటే ‘లేకుండుట’ మస్తిక అంటే ‘తల’.. మొత్తంగా శిరసు లేని దేవి. ఈ అమ్మవారి ఆలయాన్ని చింతపూర్ణి ఆలయమని పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా నుంచి 47 కి.మీ. దూరంలో సొలా సింఘి పర్వత శ్రేణులలో పర్వత శిఖరంపైన సుమారు 3,117 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ అమ్మవారికి తల ఉండదు కదా.. మరి ఎలా పూజిస్తారంటారా?

అమ్మవారు కూడా పిండి రూపంలోనే దర్శనమిస్తుంది. కాబట్టి ఆ పిండి రూపాన్నే చిన్మస్తికా దేవిగా కొలుస్తారు. పిండి అంటే లింగాకారంలో ఉన్న రాయి కానీ చెక్క కానీ అని అర్ధమట స్థానిక భాషలో. ఇక్కడకి వచ్చిన భక్తులు ఎంతటి కష్టంలో ఉన్నా సరే అమ్మవారిని కొలిస్తే వారి చింతలన్నింటినీ దూరం చేస్తుందట. చాలా మంది తమ విషయంలో అది నిజమైందని చెబుతుంటారు. ప్రతి ఏడాది జూలై – ఆగస్టు మధ్య 10 రోజులపాటు ఈ ఆలయంలో అష్టమి ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. ఇక కొన్ని ప్రత్యేక దినాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

Share this post with your friends