జంబుకేశ్వర ఆలయ మహత్స్యం ఏంటంటే..

తమిళనాడులోని తిరుచురాపల్లిలో కొలువైన జంబుకేశ్వరుడి గురించి మనం తెలుసుకున్నాం. జంబుకేశ్వరం ఆలయ విశేషాలు, మహత్స్యం ఏంటో తెలుసుకుందాం. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన ఏడు గోపురాలతో ఉండే ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉన్నారు. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమవడం కానీ.. నీటిలో ఉండటం కానీ ఉండదు. నిత్యం పానవట్టం నుంచి మాత్రం నీరు ఊరుతూ ఉంటుంది. దీనిని భక్తులకు చూపించేందుకు గానూ.. పూజారులు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పి ఉంచుతారు.

కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండితే.. దాని నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు. అందుకే జంబుకేశ్వర లింగాన్ని జల లింగమని కూడా పిలుస్తారు. స్వామి వారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. ఇక చతుర్భుజాలలో రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్టుగానూ.. కింది చేతులు అభయ హస్తం, వరద ముద్రతో అమ్మవారు అద్భుతంగా కనిపిస్తుంది.

Share this post with your friends