ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా.. ఇక్కడ స్వామివారు ఘటికాసురుడిని సంహరించిన అనంతరం సర్పరూపంలో కొలువై ఉన్నాడట. అలాగే సర్పానికి గరుడిని వల్ల ఎలాంటి ఆపద రాకుండా నరసింహావతారంలో విష్ణుమూర్తి సైతం ఇక్కడే కొలువయ్యాడట. ఈ క్షేత్ర మహత్యం ఏంటంటే.. ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు కుజ దోషం, నాగప్రతిష్ట, సర్ప దోషం వంటి పూజలు జరిపించుకోవడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. స్వామివారి అనుగ్రహంతో సంతానాన్ని పొందిన దంపతులు ఇక్కడ నాగుల విగ్రహాన్ని ప్రతిష్టించడం సంప్రదాయం.అందుకే ఇక్కడ వేలకొద్దీ నాగుల విగ్రహాలను దర్శించుకోవచ్చు.
ఘాటి సుబ్రమణ్య దేవాలయంలో ప్రతి మాసంలో అన్ని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల్లో మాదిరిగానే వచ్చే శుద్ధ షష్టి రోజు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ప్రతి మాసంలోనే వచ్చే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పూూజలు, ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఈ ఆలయంలో నరసింహ స్వామి సైతం కొలువై ఉండటం వలన విశేషంగా జరుపుకునే మరో పండుగ నృసింహ జయంతి. ఈ ఉత్సవాలు చూడటానికి కర్నాటక రాష్ట్రంలోని భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు. డిసెంబర్ నెలలో జరిగే పశువుల సంత చాలా ప్రసిద్ధిగాంచింది.