వైభవంగా శ్రీవారి స్వర్ణ రథం ఊరేగింపు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మముత్ స్వర్ణ రథంపై కొలువై స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు, మహిళా ఉద్యోగులు గోవిందా…గోవిందా… నామస్మరణతో స్వర్ణ రథాన్ని నాలుగు మాడ వీధుల్లో ఆధ్యాత్మిక పారవశ్యంతో లాగారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు శ్రీమతి సుచిత్రా ఎల్లా, అడిషనల్‌ ఈవో శ్రీ సిహెచ్‌ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. భక్తులను ఆకట్టుకుంటున్న రంగనాథ స్వామి అలంకారం, ఆకర్షణీయంగా మైసూరు నిపుణుల విద్యుత్ వెలుగుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పవిత్ర వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా చేపట్టిన పుష్ప, విద్యుత్ అలంకరణలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. జీఎన్‌సీ సర్కిల్‌ నుంచి ఆలయం వరకు దీపాలంకరణ శోభాయమానంగా నిలిచాయి. విద్యుద్దీపాలంకరణలో శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీదేవి, దేవతామూర్తులు భక్తులకు కన్నుల పండువగా నిలిచాయి. తిరుమల ఆలయం ఎదుట టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన రంగనాథ స్వామి అలంకారం భక్తులను కనువిందు చేసింది. ఆకర్షణీయమైన అలంకరణను పలువురు భక్తులు సందర్శించారు. పూలు , పండ్లతో చేసిన దేవతల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాతల సహకారం, బెంగళూరుకు చెందిన పూల వ్యాపారులు, టీటీడీ ఉద్యానవన శాఖ సిబ్బంది అలంకరణలు చేశారు.

Share this post with your friends