తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న జంబుకేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండేవారట. అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని ఆదిశంకరాచార్యులవారు శాంత స్వరూపంగా మార్చారట. అలాగే అమ్మవారి ముందు మనకు కనబడే శ్రీ చక్రాన్ని కూడా ఆది శంకరాచార్యులవారే ప్రతిష్టించారట. ఆదిశంకరులు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారట. ఈ విషయాలన్నీ మనకు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు తప్పనిసరిగా తాటంకాలు కూడా దర్శించుకోవాలట.
అమ్మవారి తాటంకాలను దర్శించడం వలన మనకు చాలా మంచి జరుగుతుందట. సువాసినితనంతో బాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయట. ఇక్కడి జంబుకేశ్వర ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. అమ్మవారికి ఎదురుగా ఆదిశంకరుల వారు ప్రతిష్టించిన వినాయకుడు కొలువై ఉన్నాడు. పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించి ఆ తరువాత శివుడిని కొలిస్తే మన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఇంకా ఈ ఆలయాన్ని సందర్శిస్తే మన కష్టాలన్నీ తీరడంతో పాటు అష్టైశ్వర్యాలు మన సొంతమవుతాయట. అలాగే స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారట.