తెరుచుకున్న పూరి జగన్నాథుడి ఆలయ ద్వారాలు.. ఆనందంలో భక్తులు

చాలా కాలం తర్వాత ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. భక్తుల హృదయ పులకరించిపోయాయి. నిన్న మొన్నటి వరకూ ఒక్క ద్వారం గుండానే పూరీ జగన్నాథుడిని భక్తులు దర్శించుకున్నారు. ఇప్పుడు నారాయణుడిని నలు ద్వారాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కోవిడ్ టైంలో మూడు ద్వారాలను మూసివేయడం జరిగింది. అప్పటి నుంచి ఒక్క ద్వారం ద్వారానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ మూతపడ్డ ప్రవేశ ద్వారాలను తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే ఆలయ మూడు ద్వారాలు తెరిపించింది.

ఇక పూరీ జగన్నాథుడి ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిని ధర్మానికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకలని అంటారు. తూర్పు దిక్కున ఉండే ద్వారమే ప్రధాన ద్వారం.. దీనిని సింహ ద్వారమని అంటారు. దీనికి రెండు వైపులా సింహాల విగ్రహాలుంటాయి. ఈ ద్వారం గుండా ప్రవేశిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందట. ఇదే ద్వారంలో ప్రముఖ దేవతల విగ్రహాలు ఉంటాయి. కాశీ విశ్వనాథుడు, గౌడీయ నరసింహ, భాగ్య హనుమాన్‌ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడే కొలువు దీరి ఉంటాయి. ఇక పశ్చిమంలో ఉండే ద్వారాన్ని వ్యాఘ్ర ద్వారమని అంటారు. ఈ ద్వారానికి రెండువైపులా పులుల ప్రతిమలుంటాయి. ఉత్తర భాగంలో ఉండే ద్వారాన్ని హస్తి ద్వారమని అంటారు. దీనికి ఇరువైపులా ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. దక్షిణ భాగంలో ఉండే ద్వారాన్ని అశ్వ ద్వారమని అంటారు. దీనికి ఇరువైపులా గుర్రాల ప్రతిమలుంటాయి.

Share this post with your friends