హరిహరులు ఒక్కరేనని చెప్పడానికి ఇక్కడ మనకు కనిపించే నిదర్శనాలేంటంటే..

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సింగోటం అనే ప్రాంతంలో కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ స్వామివారు లింగరూపంలో దర్శనమిచ్చారు. హరిహరులకు భేదం లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనమైతే.. స్వామికి అడ్డ నామాలు, నిలువు నామాలు కూడా ఉండటం మరొక విశేషం. పూర్వం శైవులు, వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం ఉండేది. అప్పుడొక సమస్య తలెత్తింది. స్వామివారి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది. అప్పుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబ, సమస్య పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులను, జీయర్ స్వాములను ఆహ్వానించారు. వారు వచ్చి స్వామివారికి అభిషేకం చేయగా.. అడ్డ, నిలువు నామాలు స్వామివారి నుదుటన కనిపించాయి.

ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయం, కూడా నిర్మించారు. ఇక్కడ స్వామి పుష్కరిణి కూడా ఉంది. దానిలో భక్తులంతా స్నానమాచరిస్తారు. అలా చేస్తే రోగాలు తొలగిపోతాయని నమ్మకం. భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమ శరీరంపై ఉన్న గడ్డలు, కురుపులు పోతాయని విశ్వసిస్తారు. ఎండాకాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలోని జలాశయాలన్నీ ఎండిపోయినా, ఈ పుష్కరిణిలో మాత్రం నీరు మాత్రం ఎండిపోదు. శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా అర కిలో మీటరు దూరంలో రత్నగిరి అనే కొండ మీద రత్నలక్ష్మీదేవి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.

Share this post with your friends