ఆదిత్య హృదయం ఏం చెబుతోంది?

సూర్యుడు ఒక్కో నెలలో ఏడు వర్ణాలకు(కులాలు) చెందినవారితో కలిసి పయనిస్తాడని తెలుసుకున్నాం కదా. అలాగే ఏ నెలలో ఎవరితో కలిసి పయనిస్తాడో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు సూర్యుని గురించి తెలుసుకుందాం. సూర్యుడు కాలకర్త మాత్రమే కాదు, విజ్ఞాన స్రష్ట కూడా. సూర్యుడి కిరణాలలో ‘త్రన’ అనే శక్తి ఉంటుంది. వీటిని అణుశాస్త్రం ఫోటానులు అంటుంది. ఒక త్రనలో ఆరో భాగం పరమాణువు. కనుక సూర్యుడు అణుశాస్త్ర కర్త కూడా. భూమికి రక్షణ కవచంగా ఉండే ఓజోన్‌ పొర మరేమిటో కాదు.. త్రనలోని అణువుల కలయికతో ఏర్పడేదే. అలాగే ప్రళయకాలంలో తన 12 రూపాలను ఒక్కసారిగా ఆకాశం మీదకు తెచ్చి యావత్‌ సృష్టిని లయంచేసే కాలహర్త, విధ్వంసకుడు కూడా సూర్యుడే.

అగస్త్యుడు వచ్చి చెప్పేదాకా శ్రీరామునికి తన కులదైవం సూర్యభగవానుడు చెబుతున్న సందేశాలు అర్థం కాలేదు. అగస్త్యముని చెప్పిన రహస్యాలే రామాయణం యుద్ధకాండలోని ఆదిత్య హృదయం. ఇందులో 31 శ్లోకాలున్నాయి. ఆఖరిది శాంతి పాఠం. మొదటి 9 శ్లోకాలు సూర్యుని తలపై భాగాన్ని, చివరి 9 శ్లోకాలు హృదయం నుంచి అరికాలి భాగాన్ని సూచిస్తాయి. మిగిలిన 12 శ్లోకాలు సూర్యుని హృదయభాగంలోకి వచ్చి తిష్ట వేసినందున అందుకు తగ్గట్టుగా వాల్మీకి ఆదిత్య హృదయంగా అక్షరీకరించాడు. కృష్ణుడి భగవద్గీతలాగే, అగస్త్య ఆదిత్య హృదయం సైతం యుద్ధరంగంలో ప్రబోధించడం గమనిస్తే జీవితమనే యుద్ధభూమిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని సూచించడమే. ఆదిత్య హృదయం అందుకు తోడ్పడుతుంది. మనం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు అనంతుడైన సూర్యుడు శక్తి-బుద్ధి అనే కిరణాలతో వాటిని దాటే శక్తి-సామర్థ్యాలను అందజేస్తాడనేది సందేశం.

Share this post with your friends