అమ్మలో త్రిమూర్తుల అంశ దాగున్నదట..

కొడుకు మంత్రం చెబితే కానీ తల్లి శరీరాన్ని వీడదట. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడంతో నాభీబంధం(బొడ్డు) తెగిపోవచ్చు. కానీ హృదయ సంబంధం మాత్రం తెగదు. కొడుకు ధార్మికుడైతే ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఎక్కడ ఉన్న పితృదేవతలనైనా ఉద్ధరించగలడు. ఇక్కడ గయా శ్రాద్ధం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం. శిశువు జన్మించిన నాటి నుంచి నాలుగు లేదా ఆరు నెలల వరకూ శిశువు శరీరానికి కావలసిన సమస్త పోషకవిలువలున్న పాలు పరమ పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తయరయ్యేది ఒక్క అమ్మలోనే – అని డాక్టర్లు చెబుతుంటారు.

నేను చెబుతున్నది సనాతన ధర్మశాస్త్రాలలోది కాదు, సనాతనం కేవలం ‘మాతృదేవోభవ’ అన్నది. పుస్తకాల్లో డాక్టర్లు రాసిన మాట మీతో మనవి చేసుకుంటున్నా. అమ్మ అన్నం తిన్నందుకు అమ్మలో పాలు ఊరవు. బిడ్డ చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావనతో ఊరతాయట. వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టే అమ్మ విష్ణువు. అమ్మను మించిన రక్షకుడు లోకంలో ఉండరు. అందువల్ల ‘మా అమ్మగారా నా వద్దే ఉంటున్నారండీ’ అనకు. అది చాలా తప్పు మాట. ‘నా అదృష్టమండీ, నాకిన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతి అన్నం తింటున్నాను’ అని అనాలి. అంతే తప్ప ‘అమ్మకు నేను అన్నం పెడుతున్నా’ననడం కృతఘ్నత. సృష్టికారకుడైన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువులే కాదు, లయ కారకుడైన రుద్రుడి అంశ కూడా అమ్మలో ఉంది. ఆమెలో ఉన్నది శివశక్తి.

Share this post with your friends