
కేరళను గాడ్స్ ఓన్ ప్లేస్‌గా చూస్తారు. అలాంటి కేరళలోని కొల్లం జిల్లా కోల్లారా గ్రామంలో ‘కొట్టంకులంగర దేవి’ కొలువై ఉంది. ఇక్కడి ఆలయంలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఇక్కడి ఆలయంలో ప్రతి ఏటా మార్చిలో చమయవిళక్కు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన నిబంధన ఒకటుంది. ఈ ఉత్సవానికి పురుషులకు ప్రవేశం లేదు. ఒకవేళ పురుషులు వెళ్లాలని భావిస్తే వారు అమ్మాయిలా మారాల్సి ఉంటుంది. కట్టు బొట్టులో అచ్చం అమ్మాయిలుగా అలంకరించుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పలువురు యువకులు అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా అలంకరించుకొని ఆలయానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు ఈ వింత ఆచారం వెనుక ఉన్న కథ, ప్రత్యేకత ఏంటంటే.. కేరళ నడిబొడ్డున కొల్లాం జిల్లా చావరలోని కొట్టంకులంగర దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే ఈ వింత ఆచారం ఉంది. దేవత పట్ల భక్తితో వేలాది మంది పురుషులు.. స్త్రీలుగా మారిపోయారు. స్త్రీల వేషధారణ ధరించడమే కాకుండా.. ఒక విలక్షణమైన ఆచారాన్ని సైతం పాటిస్తారు. ఈ సంప్రదాయాన్ని కొట్టంకులంగర చామయవిళక్కు అని పిలుస్తారు. ఆలయ వార్షికోత్సవం ఏటా 19 రోజుల పాటు జరుగుతుంది. చివరి రెండు రోజుల్లో పురుషులు స్త్రీల మాదిరిగా రెడీ అయి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక విలక్షణమైన దీపాన్ని తీసుకుని వెళ్లి మరీ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.
