వరుణ, వాయుదేవుళ్ల మధ్య గొడవ ఎంతటి విధ్వంసానికి దారి తీసిందంటే..

సామాన్యులే కాదు.. దేవుళ్లు సైతం తాము గొప్పంటే తాము గొప్పని నిరూపించుకునేందుకు పోటీలు పడుతుంటారనడానికి ఈ కథే ఉదాహరణ. ఒకసారి వరుణ దేవుడు, వాయు దేవుడు ‘నేను గొప్ప’ అంటే ‘నేను గొప్ప’ అంటూ గొడవ పెట్టుకున్నారు. ఎంతకీ తేలకపోవడంతో ఎవరు గొప్పే తేల్చుకునేందుకు జనాలను టార్గెట్ చేసుకున్నారు. వాళ్లను ఎవరు బాగా ఏడిపిస్తే వారు గొప్పని అంగీకరించాలనుకున్నారు. అంతే వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. ఏకంగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో పంటలన్నీ నీటమునిగాయి. గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు కూలిపోయి జనాలు మరణించారు. పశుపక్షాదులు నీట మునిగాయి.

నదులు, వాగులు, చెరువులు నిండుకుండను తలపించాయి. రహదారులన్నీ నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. అసలు ఇంటినుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జనాలంతా ఆవేదనతో వరుణదేవుడికి మొరపెట్టుకోవడంతో నెమ్మదించాడు. “నా ప్రతాపం చూసావు కదా. ఇప్పటికైనా నేను గొప్ప అని అంగీకరిస్తావా?” అని వాయుదేవుడిని అడిగాడు. వాయుదేవుడు కూడా తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. భూమిపై సుడిగాలి వీచింది. దుమ్ము ధూళి మినహా మరేమీ కనిపించలేదు. మిగిలిన అరకొర పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. మనుషుల్ని సైతం ఈడ్చుకుపోయింది. పెద్ద చెట్లు సైతం నేలకూలాయి. లోకమంతా అల్లకల్లోలంగా మారడంతో జనాలు వాయుదేవుడిని వేడుకోవడంతో ఉపశమించారు. ఒక్కరోజుకే జనం అల్లాడిపోయారని కాబట్టి తానే గొప్పని వాయుదేవుడు అన్నాడు. నిజమే నీవే గొప్పని వరుణుడు అన్నాడు.

Share this post with your friends