ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. నిత్యం కోటి మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానమాచరిస్తున్నారు. అయినా కూడా అక్కడి గాలి మాత్రం కలుషితం కావడం లేదు. అక్కడి వారంతా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. దీంతో పర్యావరణపరంగానూ ప్రయాగ్‌రాజ్ అందరి మన్ననలూ అందుకుంటోంది. ఇందుకు కారణం ఒక జపనీస్ టెక్నిక్. అదేమిటో తెలుసుకుందాం. ఈ జపనీస్ టెక్నిక్ కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో స్వచ్ఛమైన గాలి, పుష్కలంగా ఆక్సిజన్ అక్కడి వారికి అందుతోంది.
మహాకుంభ మేళా జనవరి 13న ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ దీనికోసం యూపీ ప్రభుత్వం రెండేళ్ల ముందు నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది. అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుంది. దీనిలో భాగంగా ముందుగా గాలి కలుషితం కాకుండా ఏం చేయాలో ఆలోచించింది. ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మియవాకి అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగ్‌రాజ్ పరిధిలో చిట్టడవిని తయారు చేసింది. అది మామూలుగా లేదు. ఇందుకోసం ప్రయాగ్ రాజ్‌లోని 10 ప్రదేశాల్లో ఉన్న 18.50 ఎకరాల భూమిలో 5 లక్షలకు పైగా మొక్కలను నాటింది. ఈ మొక్కలు మహాకుంభమేళ నాటికి దాదాపు 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల దాకా ఎత్తు పెరిగాయి. ఇప్పుడు ప్రతిరోజు ఒక్కో చెట్టు రోజూ సగటున 230 లీటర్ల నుంచి మొత్తంగా దాదాపు 11.5 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతున్నాయి. దీనికోసం ప్రయాగ్‌రాజ్ మునిసిపాలిటీ దాదాపు రూ.6 కోట్లను ఖర్చు చేసింది.