శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగిశాయి. ప్రతిరోజూ ఆళ్వార్ల దివ్య ప్రబంధ పాశురాలను గోష్టి గానం నివేదించారు. గ‌త ఏడాది డిసెంబరు 30వ తేదీ నుంచి అత్యంత వైభవంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అధ్యయనోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు. గురువారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ‘తన్నీరముదు’ ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు అనగా జ‌న‌వ‌రి 24న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.

Share this post with your friends