శివపార్వతుల వివాహం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖిమత్ బ్లాక్‌లో జరిగిందని తెలుసుకున్నాం. అక్కడి శివాలయాన్ని త్రియుగినారాయణ ఆలయం అని పిలుస్తారు. ఇక విష్ణుమూర్తి పార్వతీదేవికి సోదరుడిగా మారి ఈ వివాహాన్ని జరిపించాడు. మరోవైపు బ్రహ్మదేవుడు పూజారి అయ్యాడు. మొత్తానికి అంతా కలిసి ఈ ప్రాంతంలోనే శివపార్వతుల వివాహం జరిపించారు. త్రియుగినారాయణ ఆలయానికి ఎదురుగా విహహ స్థలం ఉంటుందట. దీనిని బ్రహ్మ దేవుడు ఈ వివాహం జరిపించాడు కాబట్టి బ్రహ్మ శిల అని కూడా పిలుస్తారు. ఈ వివాహ వేడుకలో సాధువులు, ఋషులు పాల్గొన్నారు.
ఇక ఈ ఆలయంలోమూడు చెరువులు ఉన్నాయి. వీటిని శివపార్వతుల వివాహానికి హాజరైన దేవతలు స్నానం చేసేందుకు నిర్మించారని ప్రతీతి. ఈ మూడు చెరువుల పేర్లేంటంటే.. రుద్ర కుండం, విష్ణు కుండం, బ్రహ్మ కుండం. సరస్వతి కుండం వచ్చేసి విష్ణుమూర్తి నాసికా రంధ్రాల నుంచి ఉద్భవించింది. ఈ చెరువులో సంతానం లేని వారు స్నానం చేస్తే తప్పక సంతానం కలుగుతుందట. శివపార్వతుల వివాహం సమయంలో వెలిగించిన హోమ గుండం ఇప్పటికీ ఆరిపోలేదు. నిత్యం దీనిని నెయ్యి, కర్రలు వేస్తూ ఆరకుండా చూస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే విష్ణువు వామనుడి అవతారం ఎత్తాడు.ఇంద్రాసనాన్ని పొందడానికి రాక్షస రాజు బలి వంద యాగాలు చేయవలసి రావడంతో అతను 99 యాగాలు పూర్తి చేశాడు. వందవ యాగాన్ని విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి ఆపేశాడు. కాబట్టి ఇప్పటికీ అక్కడ విష్ణుమూర్తి వామనుడిగా పూజలందుకుంటున్నాడు.