
హిందువులు ప్రకృతిని ప్రేమిస్తారు.. పూజిస్తారు. మొక్కలు, జంతువులు, పాములు ఇలా సృష్టిలో ప్రతి దానినీ పూజిస్తారు. ముఖ్యంగా పాములను అయితే నాగదేవతగా భావించి పూజించుకుంటారు. అయితే తెలిసీ తెలియక పాములకు హాని చేసినా ఆ దోషం ఎలా పోగొట్టుకోవాలా అని బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు చాలా ఉన్నాయి. సర్ప దోషాలను తొలగించేందుకు అవి మరింత ప్రత్యేకం. శ్రీ మహా విష్ణు తల్పం శేషుడు, శివుడి మేడలో వాసుకీ కూడా సర్పజాటికి చెందినవే. ముఖ్యంగా ఈ నాగదోషాలను తొలగించుకునేందుకు శ్రావణమాసం అత్యంత ముఖ్యమైనది.
శ్రావణ మాసంలోని పంచమి, కార్తీక మాసంలోని చవితి నాడు ముఖ్యంగా నాగదేవతను పూజిస్తారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ నాగ పంచమి నాడు హరిహరులతో పాటు సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైన సర్పాలను పూజిస్తే చాలు కాల సర్పదోషం తొలగిపోతుందట. నాగ పంచమి రోజున ఉపవాసముండి పుట్టలో పాలు పోస్తారు. తమ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవించే విధంగా చూడమని నాగదేవతను కోరుకుంటారు. అలాగే ముఖ్యంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటే చాలు.. కాల సర్ప దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
