కృష్ణానదిలో తెప్పోత్సవం.. విజయనగరంలో సిరిమానోత్సవం వెరీ స్పెషల్..

విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాధాన్యత కలిగిన ఆలయం. ఇక దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తీలో ఉరేగించి.. అనంతరం వన్ టౌన్ పోలీసు స్టేషను వద్దకు చేరుకోవడంతో ఊరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడలోనే అత్యంత ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు.

విజయనగరం సిరిమాను ఉత్సవం..

విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచు అయిన పైడి తల్లి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుంచి కోట వరకూ మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లెల నుంచి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుంచి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చి మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు. అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.

Share this post with your friends