శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ కంచి కామకోటి పీఠాధిపతిగా తెలుగు యువకుడి నియామకం జరిగింది. గతంలోనూ తెలంగాణలోని బాసర శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో సేవలందించారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవానికి చెందిన దుడ్డు సత్య వెంకట నాగ సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ కంచి కామకోటి పీఠాధిపతిగా నియమితులయ్యారు. అన్నవరంలో జన్మించిన గణేశ్ శర్మ తండ్రి దగ్గర ప్రాథమిమక విద్యాభ్యాసాన్ని చేపట్టారు. అనంతరం తిరుపతిలోని ప్రముఖ వేద పాఠశాలలో వేదాభ్యాసం చేశారు. వేదాంగాలు, దశోపనిషత్తులు తదితర ప్రాచీన వేద సాహిత్యాన్ని ఔపాసన పట్టారు.
2006లో వేదాధ్యాయనంలో గణేశ్ శర్మ ప్రవేశించారు. అప్పటి నుంచి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారి మార్గదర్శనంలో శిక్షణ కొనసాగించారు. ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు అంటే ఏప్రిల్ 30న ఆయన సన్యాస దీక్ష నిర్వహించారు. మఠం సంప్రదాయం ప్రకారం 25 ఏళ్ల లోపు వయసున్న వారు మాత్రమే అర్హులు. విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించగా.. గణేశ్ శర్మ 71వ పీఠాధిపతిగా నియమితులయ్యారు.