తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ ఒక్కసారిగా సెప్టెంబర్‌లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇక మీదట రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి జనవరి 1నుంచి విజయ డెయిరీ నెయ్యి సరఫరా కానుంది. ఇప్పటి వరకూ అంటే గత 35 ఏళ్లుగా మదర్ డైయిరీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నెయ్యిని సరఫరా చేస్తూ వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మదర్ డైయిరీ ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం కోల్పోనుంది.
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మాత్రమే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, కీసర, వేములకొండ తదితర ఆలయాలకు కొన్నేళ్లుగా మదర్ డెయిరీ నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ ఆలయాలన్నింటికి నెయ్యిని సరఫరా చేయడం ద్వారా ఏటా రూ.36 కోట్ల ఆదాయం మదర్ డెయిరీకి సమకూరుతోంది. కేవలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయమే ఏటా రూ.18 కోట్ల వరకూ మదర్ డెయిరీకి చెల్లిస్తోంది. జనవరి 1 నుంచి సరఫరా నిలిపివేయడంతో మదర్ డెయిరీ ఏటా రూ.36 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీ ఇప్పుడు మరింత ఇబ్బందుల్లోకి కూరుకుపోనుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి, మదర్ డెయిరీకి మధ్య ఉన్న 35 ఏళ్ల అనుబంధం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో తెగిపోనుంది.