మహాకుంభమేళాలో హాట్ టాపిక్‌గా టెకీ బాబా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రారంభం నాటి నుంచి ఒకరోజును మించి మరొక రోజు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భక్తులంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి అనంతరం నమూనా శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి సాధువులు సైతం తరలి వస్తున్నారు. ఈ సాధువుల్లో ఆధునిక జీవితానికి స్వస్తి పలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న టెకీ బాబాలు సైతం ఉండటం విశేషం. తాజాగా మహాకుంభమేళాకు వచ్చిన ఓ టెకీ బాబా హాట్ టాపిక్‌గా మారారు. ఆయనెవరో తెలుసుకుందాం.

ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. ఉన్నతోద్యోగం చేస్తూ లైఫ్‌ని ప్రతి క్షణం బిజీగా గడపాల్సిన సదరు వ్యక్తి బాబాగా మారిపోయాడు. ఆధునిరక జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకుని సాధువుగా మారిన అతను మహాకుంభమేళాకు వచ్చాడు. అతడిని చూసిన వారంతా ఫోటోలు గీసి ‘ఐఐటీయన్ బాబా’ అంటూ నెట్టింట షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. మహా కుంభమేళాకు వచ్చిన రకరకాల బాబాలను ఇంటర్వ్యూ చేస్తున్న తరుణంలో అభయ్ సింగ్ అనే బాబా తారసపడ్డాడు. అతడి మాట తీరుకు మీడియా ప్రతినిధులే షాక్ అయ్యారు. అతనెవరని ఆరా తీయగా ఐఐటీ బాంబే ఏరో స్పేస్ ఇంజినీరింగ్ చేశాడని తెలిసింది. దీంతో అతని పేరును వదిలేసి అక్కడి వారంతా ఐఐటీ బాబాగా పిలుస్తూ ఫోటోలు దిగుతున్నారు.

Share this post with your friends