అయోధ్య రాముడి నుదుటన సూర్య తిలకం.. అద్భుతం ఆవిష్కృతం..!

అంతా రామ మయం.. ఈ జగమంతా రామమయంగా మారిపోయింది ఇవాళ. ఇక సాకేతపురి అయితే శ్రీరామ నామ జపంతో పులకించి పోయింది. రాముడు నడయాడిన నేలకు తిరిగి ఇంత కాలానికి మహర్దశ పట్టింది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత రాముడి జన్మస్థలంలో ఆలయం నిర్మితమైంది. జనవరిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంతో భారతావని పులకించిపోయింది. ఇక తొలి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య నేల రామనామంతో మారుమోగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు అయోధ్యను దర్శించుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇవాళ అయోధ్య రాముడి నుదుటన సూర్యుడు తిలకం దిద్దాడు. అయోధ్య రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడేలా చేపట్టిన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాల ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇక మీదట ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన కిరణాలతో తిలకం ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఉద్దేశించినదే సూర్య తిలక్‌ ప్రాజెక్టు. ఇవాళ బాల రామయ్య నుదుటిని సూర్య కిరణాలు మూడున్నర నుంచి నాలుగు నిమిషాల పాటు ముద్దాడాయి. ఇక వీటిలో రెండు నిమిషాల పాటు సూర్య కిరణాలు మనకు రామయ్య నుదుటిపై తిలకంలా కనిపించాయి.

Share this post with your friends