ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలో శయన శివుడు కొలువై ఉన్న శివాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ పార్వతీ మాత ఒడిలో శివుడు పడుకుని ఉంటాడు. దేశంలో ఇలా శివుడు శయన రూపంలో ఉన్న ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. ఇప్పుడు సురుటుపల్లికి ఆ పేరెలా వచ్చిందో తెలుసుకుందాం. గరళకంఠుడికి సురుటుపల్లికి వచ్చే వరకూ మైకం కమ్మినట్టు అయ్యి ఆ ప్రాంతంలో పార్వతీమాత ఒడిలో పడుకుని సేద తీరాడని తెలుసుకున్నాం కదా. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చడం కోసం సురుటుపల్లికి దేవతలంతా తరలివచ్చారట.
అప్పుడు దేవతందరినీ పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడట. శివుడు కోలుకున్నాక విషయం తెలుసుకున్న శివుడు దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు. అప్పుడు శివయ్యను చూసిన దేవతలంతా ఆనందంతో ఉప్పొంగిపోయారట. అయితే దేవతలు, సప్త రుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. అయితే సురులంతా శివయ్య కోసం ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి దిగి వచ్చిన ప్రాంతం కనుక సురుల పల్లి అనే పేరు వచ్చింది. కాల క్రమేణా వాడుకలో సురులపల్లి కాస్తా సురుటుపల్లిగా మారిందట. ఇక్కడ శయన భంగిమలో ఉన్న శివుడిని దర్శించుకొంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు.