శ్రీవారి ఆలయంలో దాదాపు ఒక నెల తర్వాత ఇవాళ తిరుమల ఆలయంలో సుప్రభాతం – మేల్కొలుపు సేవ తిరిగి ప్రారంభమైంది. నెల రోజుల పాటు తిరుమల శ్రీవారికి తిరుప్పావై సేవ నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 16న ఉదయం 6:57 గంటలకు ప్రారంభమైన శుభ ధనుర్మాసం కారణంగా, డిసెంబర్ 17 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై సేవను నిర్వహిస్తున్నారు. జనవరి 14న ధనుర్మాసం పూర్తి కావడంతో శ్రీవారికి అనుదినం నిర్వహించే అతి ముఖ్యమైన తొలిసేవ-సుప్రభాత సేవ బుధవారం నుంచి తిరిగి ప్రారంభంకానుంది.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం (MTVAC)లో భక్తులతో కలసి భోజనం చేసి సంక్రాంతి పండుగను భక్తుల మధ్య టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు జరుపుకున్నారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత గురించి భక్తులతో అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాద భవనంలో వడ్డిస్తున్న అన్నప్రసాదల నాణ్యత, రుచి మెరుగుపడిందని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.