నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం స్థల పురాణం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కి.మీ దూరంలో ఉంటుంది. అన్నంభట్టు గురించి తెలుసుకున్నాం. అన్నంభట్టుకు ఒకరోజు సుబ్రహ్మణ్యస్వామి కలలో కనిపించి పెన్నానది పరివాహకం వద్ద నాగ ప్రతిష్ట చేయమని చెప్పాడట. అప్పుడు అన్నంభట్టు నాగుల కోసం వెతుకుతుండగా ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా. నాగులను పోలిన రాళ్లు లభ్యమయ్యాయట. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించాడట.
నాగలమడక ఆలయ విశేషాలు ఏంటంటే.. ఆలయ నిర్మాణం ప్రారంభ దశలో కేవలం నాలుగు స్తంభాలతో మాత్రమే మంటపాన్ని నిర్మించారు. నాలుగు రాళ్లను నిలబెట్టి రాతిబండ పరిచారు. ఆ తరువాత కొంతకాలానికి రొద్దంకు అనే గ్రామానికి చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారానికి సంబంధించిన సరుకులు పెట్టుకున్నాడు. ఒకరోజు అతను నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పాడట. ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ప్రతి ఏటా రథోత్సవం నిర్వహించే రోజున ఈ వంశస్తులు అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు.