స్టాట్యూ ఆఫ్ యూనియన్‌.. 90 అడుగుల హనుమంతుడి విగ్రహం ఆవిష్కృతం

అమెరికాలోని హ్యూస్టన్ నగరం.. ఆంజనేయ నామ స్మరణతో మారుమోగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో..హ్యూస్టన్‌ నగరంలోని దివ్య అష్టలక్ష్మీ ఆలయంలో భక్త కోటి నడుమ వైభవంగా ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రతిష్ట జరిగింది. స్టాట్యూ ఆఫ్ యూనియన్‌గా ఈ 90 అడుగుల హనుమంతుడి విగ్రహం వ్యవహరిస్తోంది. అంతేకాకుండా అమెరికాలోనే ఇది మూడో అతిపెద్ద విగ్రహం కావడం విశేషం. రామాయణంలో శ్రీరాముడికి ఎంతటి ప్రాధాన్యత ఉందో.. హనుమంతుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సీతారాముల కథను సుందరమయం చేసిన వాడిగా హనుమంతుడు ప్రఖ్యాతిగాంచాడు.

ఇక హ్యూస్టన్ నగరంలో రూపొందిన హనుమంతుడి విగ్రహం లోకానికి అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది. 90 అడుగుల స్టాట్యూ ఆఫ్ యూనియన్‌ను చినజీయర్ స్వామి అమృత హస్తాలతో లోకార్పణ కావించారు. హ్యూస్టన్ నగరంలో అష్టలక్ష్మీ ఆలయంలో ఈ హనుమంతుడి విగ్రహం అగ్రరాజన్యంలో భారతీయ సనాతన వైభవానికి ప్రతీకగా నిలిచింది. హనుమంతుడిని ఆరాధించని హిందువు ఉండరు. భక్తులకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించే హనుమంతుడు అమెరికాలోనూ ఇకపై తన భక్తులను అనుగ్రహించనున్నాడు.

Share this post with your friends