శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు: టీటీడీ

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు లడ్డూ ధరల్లో భారీగా మార్పులు చేర్పులు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. దర్శనం, లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది.పలు సామాజిక మాధ్యమాలలో తిరుమలేశుని లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేసింది.

ప్రత్యేక ప్రవేశ దర్శన కోసం దళారులను సంప్రదించొద్దు..

ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతోంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. అయితే కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్‌సైట్ ద్వారా భక్తులకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు టీటీడీ విజిలెన్స్ హెచ్చరించింది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Share this post with your friends