తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. నిన్న డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలు సహా పలు కీలక విషయాలను భక్తులతో పంచుకున్నారు. ఈ ఏడాది అక్టోబరు 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్ 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుండి పుష్కరిణిని మూసివేశామని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా శ్యామలరావు తెలిపారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని వెల్లడించారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకుగాను జూలై 22వ తేదీ నుంచి ఆఫ్ లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించినట్టుగా ఈవో తెలిపారు.