8న తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్‌కు శ్రీవారి కల్యాణ రథం

హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప్రయాగ రాజ్‌(అలహాబాద్‌) వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాకు విచ్చేసే కోట్లాదిమంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాన్ని క‌ల్పించేందుకుగాను టీటీడీ న‌మూనా ఆల‌యాన్ని నిర్మిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో తాజాగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ‌వాసుకి ఆలయ స‌మీపంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎక‌రాల్లో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిరోజు తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నిర్వహిస్తామన్నారు. జ‌నవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునట్లు చెప్పారు. మ‌హా కుంభ‌మేళాలో శ్రీ‌వారి న‌మూన‌ ఆల‌య నిర్వ‌హ‌ణ‌, భ‌క్తుల సౌక‌ర్యాల ఏర్పాటుకు టీటీడీ నుండి అర్చ‌క స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బందిని ప్రయాగ్ రాజ్ కు పంపుతున్నట్లు తెలిపారు. తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కు 8వ తేది ఉదయం 7 గంటలకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరుతుందని తెలియజేశారు.

Share this post with your friends