శ్రీశైలం మల్లన్నకు విరాళంగా ఎర్రరాళ్ళు పొదిగిన బంగారు నాగాభరణం..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీశైలానికి శ్రావణ మాసం నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారు. ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు మల్లన్నకు భూరి విరాళం సమర్పించాడు. బంగారు నాగాభరణాన్ని స్వామివారికి విరాళంగా సమర్పించాడు. రాయఘడ్ జిల్లా గుణుపూరుకు చెందిన గోపాలరావు అనే భక్తుడు దేవస్థానానికి 45 గ్రాములతో ఎర్రరాళ్ళు పొదిగిన బంగారు నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నాగాభరణాన్ని అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో ఆలయ అధికారులకు గోపాలరావు అందజేశారు.

బంగారు నాగాభరణాన్ని విరాళంగా అందజేసిన భక్తుడికి అధికారులు దేవస్థానం రశీదుతో పాటు వేదాశీర్వచనముతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఇక శ్రీశైలంలో ఎక్కడ లేని విధంగా స్పర్శ దర్శనం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ స్పర్శ దర్శనాన్ని ఈ నెల 19 నుంచి ఐదు రోజుల పాటు నిలిపివేయనున్నారు. స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే గర్భాలయ, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల జేశారు.

Share this post with your friends