శ్రీశైలం దేవస్థానం భక్తులకు నచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. విభూతి తిలక ధారణను తిరిగి ప్రారంభించింది. కరోనా సమయంలో నిలిపివేసిన ఈ సంప్రదాయాన్ని ఈవో పెద్దిరాజు మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులకు విభూతి ధారణ గావించి పున: ప్రారంభించారు. దర్శనం క్యూ కాంప్లెక్స్ వద్ద ఈ సౌకర్యాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు. దీంతో స్వామివారి దర్శనానికి వెళ్లే వారంతా ముందుగా విభూతి ధారణ చేసుకుని వెళుతున్నారు. కరోనా సమయంలో ఈ విభూతి ధారణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిలిపి వేశారు. తిరిగి దీనిని ప్రారంభించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సంప్రదాయమని.. ఇది ఎంతో విశిష్టమైన మన సంస్కృతికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఈఓ పెద్దిరాజు ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా తెలిపారు. భారతీయ పురాణాలు సైతం విభూతి మహిమ గురించి వివరిస్తున్నాయి. దాదాపుగా ప్రతి శైవ క్షేత్రంలోనూ మనకు విభూతి కనిపిస్తుంది. తప్పక విభూతి ధారణ అనంతరం మనం ఆలయంలోకి వెళతాం. విభూతి అనేది పవిత్రతను కలిగిస్తుందని, అరిష్టాలన్నింటిని తొలగించి సకల శుభాలను కలిగిస్తుందని పండితులు చెబుతారు. విభూతి ధారణ వలన సమస్త సంపదలు చేకూరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.