శ్రీనివాసుడి సాక్షాత్కార వైభవం ప్రతి ఏటా నిర్వహించడానికి కారణమేంటంటే..

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏటా సాక్షాత్కార వైభవం నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణమేంటంటే.. శ్రీనివాసుని ఆలయాన్ని ముస్లింలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడికి శ్రీనివాసుడు కలలో కనిపించాడట. ఈ విషయాన్ని సుందరరాజ మంగాపురానికి వచ్చి ‘‘శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు” అని స్వామి ఆదేశించారని బ్రాహ్మణుడు వివరించారు.

అనంతరం గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు.

స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 జులై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు.అదేవిధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా టీటీడీ అప్పటి నుంచి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ”సాక్షాత్కార వైభవం” పేరిట టీటీడీ ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి టీటీడీ నిర్వహిస్తుండడం విశేషం.

Share this post with your friends