దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో రెండు రోజుల పాటు, మరికొన్ని ఆలయాల్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తిరుమలతో పాటు తిరుమల అనుబంధ ఆలయాలన్నింటిలోనూ ఇవాళ, రేపు జన్మాష్టమి వేడుకలు జరుగనున్నాయి. అలాగే ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలోనూ శ్రీకృష్ణ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. రేపు ఆలయంలో ఊట్ల పండుగ, స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
ఇక శ్రావణ మాసం సందర్భంగా ఆలయం నిత్యం సందడిగా ఉంది. శ్రావణమాసం అంతా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఈ నెల 30న ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. మహిళా భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ ఆలయానికి చిన్న తిరుపతిగా పేరుగాంచింది. తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకోలేని వారంతా ఈ ఆలయంలోనే చెల్లిస్తూ ఉంటారు. అందుకే స్వామివారిని సైతం చిన వెంకన్నగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు.