
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి.. వడ్డీకాసులవాడి హుండీ ఆదాయం మామూలుగా లేదు. కొన్ని నెలలుగా హుండీ ఆదాయంలో తన రికార్డులను తనే బ్రేక్ చేసుకుంటున్నాడు. శ్రీవారి ఆదాయం ఊహకు అందని రితిలో పెరిగిపోతోంది. ఈ మధ్య కాలంలో వంద కోట్ల రూపాయల నుంచి మెట్టు దిగిందే లేదు. ఈ ఏడాది ఈ ఏడాది మొదటి 10 నెలల్లో కళ్లు చెదిరే హుండీ ఆదాయం శ్రీ మలయప్ప స్వామికి లభించింది. ఏకంగా 10 నెలల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ 1142.43 కోట్లకు చేరింది. తిరుమల వెంకన్న ఆదాయం నవంబర్ నెలలో రూ 111.30 కోట్లు వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 11 నెలల ఆదాయం కాస్తా రూ.1253.73 కోట్లకు చేరుకుంది.
11 నెలల్లో మొదటి 6 నెలల హుండీ ఆదాయమే రూ 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరి నెలలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చిలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్లో రూ. 101.63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్లో రూ 113.64 కోట్లు, జులైలో రూ 125.35 కోట్లు, ఆగష్టులో రూ 125.67 కోట్లు, సెప్టెంబర్లో రూ 114.11 కోట్లు, అక్టోబర్లో రూ 107.30 కోట్లు, నవంబర్లో రూ 111.30 కోట్ల హుండీ ఆదాయం శ్రీవారికి లభించింది.ఆగస్ట్ నెలలోనే ఈ ఏడాది అత్యధిక ఆదాయం లభించింది. ఆగస్ట్ నెలలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
